కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) పురుషుల జావెలిన్ త్రోలో భారత్ సత్తా చాటింది. అర్హత పోటీలలో ముగ్గురు భారత అథ్లెట్లు ఫైనల్‌కు (Javelin Final) అర్హత సాధించి పతకాల పోరులో భారత్ ఆశలను రెట్టింపు చేశారు. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ కూడా ఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు. గ్లాస్గోలో గురువారం జరిగిన అర్హత పోటీలలో చల్లని వాతావరణం, ఎదురుగాలి మధ్య అథ్లెట్లు పోటీపడ్డారు. వెన్ను గాయం నుంచి కోలుకున్న నీరజ్ చోప్రా జాగ్రత్తగా బరిలోకి దిగాడు. తొలి ప్రయత్నంలో 76.28 మీటర్లు విసిరిన అతడు, రెండో ప్రయత్నంలో 79.61 మీటర్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫైనల్‌కు అర్హత ఖాయం కావడంతో చివరి ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్‌ను ఏ అథ్లెట్ కూడా అందుకోలేకపోవడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా తొలి 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేశారు. శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 82.84 మీటర్లతో అర్హత పోటీలలో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ యాదవ్ తొలి ప్రయత్నంలో 77.04 మీటర్లు, రెండో ప్రయత్నంలో 78.37 మీటర్లు విసిరి మొత్తం ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు చేరాడు. యశ్ వీర్ సింగ్ కూడా తొలి రెండు ప్రయత్నాలలో 73.89, 74.45 మీటర్లు నమోదు చేసి, చివరి ప్రయత్నంలో 78.36 మీటర్లు విసిరి పదో స్థానంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నీరజ్ చోప్రాకు ఇదే తొలి కామన్వెల్త్ గేమ్స్. గాయం కారణంగా 2022 ఎడిషన్‌కు దూరమైన అతడు, ఈ ఏడాది జూన్‌లో దోహా డైమండ్ లీగ్‌తో మళ్లీ పోటీల్లోకి వచ్చాడు. శుక్రవారం జరిగే ఫైనల్లో నీరజ్, రోహిత్, యశ్ వీర్ సింగ్ ముగ్గురూ భారత్ తరఫున పతకాల కోసం పోటీ పడనున్నారు.

