కలం, నిర్మల్: బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో (RGUKT Basara) పీయూసీ -1 విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.ఎల్. సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నైతిక విలువలతో వాటిని సాధించాలని సూచించారు. ఆర్జీయూకేటీలో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మార్కులతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యాలుగా తీర్చిదిద్దడమే ఆర్జీయూకేటీ లక్ష్యమన్నారు. విద్యార్థులు అకాడమిక్స్ తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ రాణించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి యాజమాన్యం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

