కలం, ఖమ్మం బ్యూరో : వర్షాకాలం రాకతో ఖమ్మం నగరంలో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రభుత్వం తక్షణమే అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సమగ్రమైన ‘స్పెషల్ ప్లాన్’ రూపొందించి పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నగరంలోని పలు డివిజన్లలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం, వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల స్థానికులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. సరియైన పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి, నీరు నిల్వ ఉన్న చోట ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ నగర పరిధిలో పరిశుభ్రతను పాటించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ ఆ ప్రకటన లో స్పష్టం చేశారు.

