కలం, ఖమ్మం బ్యూరో : సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి వారం రోజుల్లోగా పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti ) హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి గురువారం మంత్రి విస్తృతంగా పర్యటించి, రూ. 2.77 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పర్యటనలో భాగంగా గుంపెన గ్రామంలో రూ.45లక్షలతో 9 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, నరసాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ. 117.30 లక్షలతో 8 సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం భీమునిగూడెంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కోండాయిగూడెం 2బీహెచ్‌కే కాలనీ పరిధిలో రూ. 20 లక్షల పనులకు, పెద్దిరెడ్డిగూడెంలో రూ. 75.50 లక్షల అంచనా వ్యయంతో 17 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డిగూడెం, గుంపెన, భీమునిగూడెం, నరసాపురం, ఊటుపల్లి, రంగాపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని, ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా సొంతింటి కల సాకారం చేస్తామని మంత్రి చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని, చేపట్టిన పనులన్నీ నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఇతర ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

