కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో రెండేళ్ల విరామం తర్వాత గురువారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు (Mandal Meeting) పలు మండలాల్లో సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచాయి. అయితే సోన్ మండల సమావేశం మాత్రం చర్చనీయాంశమైంది. గ్రామ ప్రజల సమస్యలను వినిపించాల్సిన మహిళా సర్పంచ్ల స్థానంలో వారి భర్తలే సమావేశ మందిరంలో ప్రత్యక్షమవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి సీహెచ్ సుధాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి సాకేరా, మాదాపూర్, పాక్పట్ల గ్రామాల మహిళా సర్పంచ్లకు బదులు వారి భర్తలు ఉదయ్, మల్లేష్ యాదవ్, రమేష్ హాజరయ్యారు. కూచన్వల్లి గ్రామ సర్పంచ్ అంకం మమత సమావేశానికి వచ్చినప్పటికీ, ఆమెతో పాటు ఆమె తండ్రి బండి లింగన్న కూడా సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం “సర్పంచ్ పతుల పాలన” కొనసాగుతుందనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. అధికారిక సమావేశాల్లో మహిళా సర్పంచ్లకు బదులుగా వారి భర్తలు సమావేశంలో పాల్గొన్నప్పటికీ అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

