కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క (Minister Seethakka ) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలోనే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు.
ఇప్పటికే 16 జిల్లాల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి.. మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు టీచర్లు, ఆయాల యూనిఫాంలను అక్టోబర్ తొలి వారంలోగా సిద్ధం చేయాలన్నారు. మరోవైపు అంగన్‌వాడీ టీచర్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిప్లొమా సర్టిఫికేట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గత ఏడాది కాలంలో అదనంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస వసతులు కూడా పూర్తి స్థాయిలో అందలేదని, ప్రజా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

