కలం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ నేడు జైలుకు చేరుకున్నారు. అయితే ములాఖత్ సమయం సాయంత్రం 5 గంటల వరకే ఉండగా జగన్ పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో అధికారులు జగన్‌ను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన జైలు బయటే సీదిరి కుటుంబసభ్యులను పరామర్శించి, మీడియాతో మాట్లాడారు.
అప్పలరాజు కుమారుడు ఆరవ్ పొరపాటున రోడ్డు ప్రమాదం చేశాడని జగన్ అన్నారు. ఆరవ్‌పై పెట్టిన కేసుల ప్రకారం ఇందులో కుట్ర కోణం ఎక్కడుందని ప్రశ్నించారు. ఆరవ్ 18 ఏళ్ల యువకుడు అని, పిల్లాడి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం తర్వాత అప్పల రాజు కుమారుడే 108కి ఫోన్ చేశాడని చెప్పారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి సీపీఆర్ కూడా చేశాడన్నారు. సీఎం చంద్రబాబు యాక్సిడెంట్‌ను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజు బీసీల్లో బలమైన నాయకుడని, కష్టపడి రాజకీయంగా ఎదిగారని జగన్ చెప్పారు. అప్పలరాజుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. అప్పలరాజు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించారని, కానీ, చంద్రబాబు ఆ సాయం అందకుండా చేశారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు (Chandrababu) దుర్మార్గపు ఆలోచనలతో వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రలోభాలతోనే విశాఖ మేయర్ రాజీనామా చేశారన్నారు. యాదవులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఇదేనా? అని జగన్ ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఉన్న పథకాలను కూడా చంద్రబాబు రద్దు చేస్తున్నారని చెప్పారు. పథకాల రద్దుతో ఎక్కువగా నష్టపోయేది బీసీలేనని తెలిపారు.
ఇక గతంలో పాతపట్నం ఎమ్మెల్యే కారు యాక్సిడెంట్ చేశారని, అలాగే ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు యాక్సిడెంట్ చేశారని, ఈ రెండు కేసుల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని జగన్ (YS Jagan) ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారా? అని నిలదీశారు. చంద్రబాబు చెసేదంతా మోసం, చెప్పేవన్నీ అబద్దాలేనని జగన్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పలరాజు కుమారుడికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమకు న్యాయ వస్వవపై నమ్మకం ఉందని, అప్పలరాజు త్వరలో జైలు నుంచి బయట వస్తాడని జగన్ అన్నారు. ఇక నుంచి చంద్రబాబుపై యుద్దం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.
Read Also: జగన్‌కు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్!
Follow Us On : WhatsApp

