జిల్లా వ్యాప్త పాదయాత్రలకు సీపీఐ పిలుపు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రలతో ప్రజలను ఏకంచేస్తామని మహబూబ్ నగర్ సీపీఐ (Mahabubnagar CPI) జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్ అన్నారు. గురువారం సురవరం వెంకట్రామారెడ్డి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాదయాత్ర ప్రచార కరపత్రాలను చేశారు.

ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ప్రజల అసలు సమస్యలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఆగస్టు 6 నుంచి 14 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని బాలకిషన్ దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (MSP)కు హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను బలహీనపరిచే చర్యలు చేపడుతోందని, విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసి పేదలకు అందని స్థితికి తీసుకెళ్లిందని విమర్శించారు.

అలాగే మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, సీపీఐ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సంఘటితం చేస్తామని, జిల్లా ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బాలకిషన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేష్, చాంద్ పాషా, కే రమేష్, నరసింహ, శ్రీలత, పూజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: రెడ్ అలర్ట్.. ముందస్తు చర్యలపై పొంగులేటి టెలికాన్ఫరెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>