కలం, మెదక్ బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహల వద్ద సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మెదక్ ఎస్పీ (Medak SP) శ్రీనివాసరావు (Srinivasa Rao) హెచ్చరించారు. వరద నీటిలోకి దిగడం, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. మెదక్ జిల్లా ఏడుపాయలలోని ఘనాపూర్ ఆనకట్టలోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఆనకట్ట పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో పశువులను మేపే కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ (Medak SP) సూచించారు.
నీటి ప్రవాహం పెరిగిన సమయంలో పశువులను వాగులు, కాలువలు, ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల వైపు తీసుకెళ్లవద్దని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, పాపన్నపేట పీఎస్ ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Read Also: బొగ్గు మాఫియాపై ఈడీ పంజా.. 600 కోట్ల ఆస్తులు సీజ్!
Follow Us On: Sharechat

