కలం, వరంగల్ బ్యూరో: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ది విషయంలో ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు ఆయన పరిస్థితి ఏంటని డాక్టర్లు కూడా చెప్పే పరిస్థితి లేదన్నారు. పెద్దిని బతికించుకోవడానికి మానవ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని వివరించారు. అమెరికా, లండన్ వైద్యులతో తాను స్వయంగా సంప్రదింపులు చేస్తున్నానని హరీశ్ తెలిపారు.
మెదడు పనితీరు ఆందోళనకరం..
పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) బీపీ బాగానే ఉందని, ఆక్సిజన్ 50 శాతం సొంతంగా తీసుకోగల్గుతున్నారని హరీశ్ రావు (Harish Rao) వివరించారు. మెదడు పనితీరే ఆందోళనకరంగా మారిందన్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన రోజు 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిందన్నారు. 5 నిమిషాలు గుండె ఆగిపోయినా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తారని.. 9వ సారి సీపీఆర్ చేసినప్పుడు గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. అంతసేపు మెదడు పనితీరు ఆగిపోయేసరికి, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వివరించారు. వాస్తవానికి పెద్దికి మొదట ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని.. గత 20 రోజులుగా మందులు వాడకపోయేసరికి ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిని, అది గుండెపై ప్రభావం చూపిందన్నారు.
నిరంతరం కేసీఆర్ ఆరా..
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని హరీశ్ రావు అన్నారు. వైద్యులతో ఆయనే నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ.. మానిటరింగ్ చేస్తున్నారని వివరించారు. పెద్ది అభిమానులు, నర్సంపేట కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రికి రావొద్దన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటామన్నారు.
Read Also: ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు!
Follow Us On: Instagram

