కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ (Theegalaguttapally ROB) నిర్మాణ పనుల్లో జాప్యంతోపాటు రవాణా రాకపోకలు, స్థానిక ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలుగుతుండటం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా వృద్ధురాలు ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో పడిపోయారనే సమాచారం రావడంతో అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారిని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యాన్ని తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ మాట్లాడుతూ.. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణపై దృష్టి పెట్టిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్వోబీ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా పనులు ఆగిపోయాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం ఉదయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో న్యూఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్ద బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హుటాహుటిన తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్దకు వెళ్లారు. ఆర్వోబీ సమీపంలోని కల్వర్టును పరిశీలించారు. ఆర్వోబీ వద్ద రాకపోకలకు జరుగుతున్న ఇబ్బందులను గమనించారు. బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఆయా పనులను చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే యుద్ద ప్రాతిపదికన ఆయా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి సేత బంధన్ స్కీం కింద కేంద్రమే పూర్తి స్థాయి నిధులను వెచ్చిస్తున్నప్పటికీ పనుల జాప్యానికి కారణాలేమిటని ఈ సందర్భంగా బండి సంజయ్ సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. దీనిపై కాంట్రాక్టర్ స్పందిస్తూ.. ‘‘ఆర్వోబీ నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేసినందున ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది’’ అని వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైందని, అతి త్వరలోనే నోటిఫికేషన్‌ను ఇవ్వనుందని తెలిపారు. ఏది ఏమైననప్పటికీ రాబోయే 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి వన్ సైడ్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. దీంతోపాటు వచ్చే ఏడాది వరకు ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నందున, గడువులోగా రెండువైపులా ఆర్వోబీ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
Read Also: ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు!
Follow Us On : WhatsApp

