నల్లగొండలో 552 ఇళ్లు.. 9 ఏళ్లుగా ఎదురుచూపులే!

నల్లగొండ, కలం ప్రతినిధి: పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పాడుబడుతున్నాయి. తొమ్మిదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇళ్లలోని కిటికీ అద్దాలు, విద్యుత్ బోర్డులు, నీటి పైపులను ధ్వంసం చేశారు. మద్యం సీసాలు, చెత్తాచెదారంతో ఇళ్ల ప్రాంగణాలు నిండిపోయాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారగా.. కొన్ని ఇళ్లు గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి.

నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఈ పరిస్థితి నెలకొనడం అధికారుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది. రోడ్లు, డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక వసతుల పనులు పూర్తికాలేదు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించలేదు. విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి అత్యవసర వసతులను కల్పించి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే.. మిగిలిన పనులను తర్వాతైనా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇళ్లు మరింత శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

552 ఇళ్లు.. తొమ్మిదేళ్ల నిరీక్షణ

నల్లగొండ టౌన్ కు ఉపాధి కోసం వలస వచ్చి దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కనీసం 60 గజాల స్థలం కొనుగోలు చేసుకునే స్థోమత లేని కుటుంబాలు ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో 2017లో నల్లగొండ జిల్లా కేంద్రంలో 552 డబుల్ బెడ్‌రూమ్ (Nalgonda Double Bedroom) ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు కేటాయిస్తామని అధికారులు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం లబ్ధిదారుల ఎంపికకు లాటరీ ప్రక్రియ చేపట్టారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అర్హులైన నిరుపేదలను పక్కనపెట్టి ఆర్థికంగా స్థోమత ఉన్నవారి పేర్లను జాబితాలో చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 10 నుంచి 20 ఎకరాల వరకు భూములు ఉన్నవారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.

కళ్లముందే ఇళ్లు.. అడుగు పెట్టలేని దుస్థితి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. అయినా డబుల్ బెడ్‌రూమ్ (Nalgonda Double Bedroom) ఇళ్ల పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు. కళ్లముందే తమ కోసం నిర్మించిన ఇళ్లు పాడుబడిపోతుండటం లబ్ధిదారులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ఆకతాయిలు, మందుబాబులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇళ్లకు కనీస మౌలిక వసతులు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి అత్యవసర పనులను పూర్తి చేస్తే.. ఇళ్లను వినియోగంలోకి తీసుకురావచ్చని చెబుతున్నాయి. తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కలను ఇకనైనా సాకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. లేదంటే ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మంత్రి ఇలాకాలోనే..

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో 552 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోకపోవడం గమనార్హం. పేదల కోసం నిర్మించిన ఇళ్లు ఉపయోగంలోకి రాకముందే పాడుబడిపోతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి ఇళ్ల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులను కల్పించి అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు.

త్వరగా లబ్ధిదారులకు కేటాయించాలి:నారి అయ్యిలయ్య, సీపీఎం నేత, నల్లగొండ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వెంటనే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను పూర్తి చేయాలి. గతంలో జరిగిన లాటరీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, ధనిక వర్గాలను తొలగించి, నిజమైన నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మౌలిక వసతులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను కేటాయించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>