కలం, తెలంగాణ బ్యూరో: ఆంధ్రా పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణ.. 12 ఏళ్ల కిందట స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. కానీ, ఇప్పటికీ హైదరాబాద్‌లోని చాలా తెలంగాణ అధికారిక భవనాలను (Telangana Buildings) ఏపీ ఖాళీ చేయడంలేదు. తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంటున్నది. దీంతో తెలంగాణ ఆఫీసర్లకు నివాస వసతి లేక గెస్ట్ హౌస్‌ల్లో ఉంటుంటే.. సర్కార్ బిల్డింగ్స్ మాత్రం ఏపీ ఆధీనంలో ఖాళీగా పడి ఉంటున్నాయి.
ఏపీ ఆధీనంలో 589 భవనాలు..
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ఉమ్మడి రాజధానిగా పదేండ్లు హైదరాబాద్‌పై గవర్నర్‌కు కొన్ని అంశాల్లో నియంత్రణ ఉండేది. ఈ కారణంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండిపోయింది. 2024 జూన్ 1 నాటికే ఆ గడువు తీరిపోయినా ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని భవనాలను స్వాధీనం చేసుకోవడంలో ఇక్కడి సర్కార్ తాత్సారం చేస్తోంది. మొత్తం ఏపీ ఆధీనంలో 589 భవనాలు ఉండగా.. వాటిలో 368 ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా తిరిగి ఏపీ ఇవ్వడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత..
విభజన చట్టంలోని నిబంధన ప్రకారం నాడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కుందన్‌బాగ్, ఎర్రమంజిల్, పాటిగడ్డ, సైఫాబాద్, మలక్‌పేట్, కలిడెర, మాదన్నపేట తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భవనాలను ఏపీ ప్రభుత్వం చేతికి వెళ్లాయి. నగరంలో మొత్తం 2,565 భవనాల్లో ఏపీకి 589 ఇవ్వగా.. మిగిలినవి తెలంగాణ ఆధీనంలో వినియోగంలో ఉన్నాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కారణంగా వీటిని 2024 జూన్ 1 వరకు ఏపీ వాడుకోవాలి. ఇప్పటికే ఆ గడువు తీరిపోయి రెండేండ్లు దాటుతోంది.
వీటిని ఏపీ అజమాయిషీ నుంచి తీసుకోవడంపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికీ 589 భవనాలు ఏపీ ఆధీనంలోనే ఉన్నాయి. రోడ్లు భవనాల విభాగం లెక్కల ప్రకారం ఇందులో 221 భవనాల్లో ఇప్పటికీ ఏపీ సిబ్బంది ఉంటుండగా, మిగిలిన 368 ఇళ్లను ఖాళీ చేసినట్లు తేలింది. ఖాళీ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం తెలంగాణకు అప్పజెప్పలేదు. ఇప్పటికీ అవి కూడా వారి ఆధీనంలో ఉన్నట్లుగా తెలంగాణ రికార్డుల్లో నమోదైంది.
ఇక్కడి ఆఫీసర్లకు వసతి కరువు..
హైదరాబాద్‌లోని సర్కార్ బంగళాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా తెలంగాణలోని సీనియర్ అధికారులకు మాత్రం నివాస వసతి విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీ ఆధీనంలో ఉన్న 589 భవనాలను స్వాధీనం చేసుకుంటే తెలంగాణ ఆఫీసర్ల రెసిడెన్షియల్ ఇబ్బందులను తగ్గించవచ్చన్న మాటలు ఆర్ అండ్ బీ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన 589 భవనాల్లో ఆల్రెడీ 368 ఖాళీగానే ఉన్నాయి. వాటికి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో డ్యామేజ్ అవుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికీ తమను కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పంపేశారంటూ ఉమ్మడి ఏపీ విభజనపై అక్కడి నాయకులు అంటూనే ఉన్నారు. అలాంటి నేతలే ఇంకా హైదరాబాద్‌లోని భవనాలను తిరిగి ఇవ్వకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ సర్కార్ తీరుపై విమర్శలు..
* ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా ఇక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో పలు సందర్భాల్లో ఆ సాఫ్ట్ కార్నర్ బహిర్గతమైందని అంటున్నాయి. గోదావరి జలాల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై మెతక వైఖరి అవలంబిస్తున్నరన్న ఆరోపణలూ ఉన్నాయి.
* విభజన చట్టంలోని ‘ఉమ్మడి రాజధాని’ అనే నిబంధనల మేరకు అప్పటి అవసరాల కోసం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన ఇళ్లను ఇప్పుడు స్వాధీనం చేసుకోవడంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే అంశం ఆ శాఖలోనే చర్చకు దారితీసింది.
ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల వివరాలు..
బంజారాహిల్స్ (64) : 33
కుందన్‌బాగ్ (84) : 44
పంజాగుట్ట ఫ్లాట్స్ (19) : 9
ఎర్రమంజిల్ (434) : 67
పాటిగడ్డ (504) : 95
సైఫాబాద్ (16) : 12
మాదన్నపేట్ (73) : 8
కలిడెర (91) : 13
మలక్‌పేట్ (1280) : 308
(బ్రాకెట్లలో ఉన్నది మొత్తం భవనాల సంఖ్య)

