కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని అనుబంధ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

