కలం, కరీంనగర్: ఎల్ నినో నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.
తక్కువ నీటితో సాగు చేసేలా..
వర్షాభావ పరిస్థితులను రైతులకు వివరించి, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు చైతన్యపరచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కందులు, పెసలు, నూనెగింజల పంటలు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు ఎక్కువ జరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను పక్కాగా సేకరించి ఇవ్వాలన్నారు.
విత్తనాలు అందుబాటులో..
విత్తన మేళాలను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్రెడ్డి, వ్యవసాయ సాంకేతిక అధికారులు పాల్గొన్నారు.

