కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త సాయిబాబా ఆలయం (Datta Sai Baba Temple) పాలకవర్గం నియామకం ఎప్పుడు ఏర్పాటవుతుందని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29న జరిగే గురుపౌర్ణమి మహోత్సవాలు ఎలా నిర్వహిస్తారు? నూతన పాలకవర్గం ఆధ్వర్యంలోనా? లేక ఇన్చార్జి ఈవోతోనేనా? అనే ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 21తో ఆలయ పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటి నుంచి కొత్త పాలకవర్గాన్ని నియమించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ధర్మకర్తల నియామకానికి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, ఇప్పటివరకు నియామక ప్రక్రియ పూర్తికాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మూడు రోజుల్లో వేడుకలు.. ప్రచారం మాత్రం శూన్యం
ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి, దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించే ఈ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నా ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు. గతంలో వారం రోజుల ముందే పోస్టర్లు, కరపత్రాలు, గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టేవారు. ఈసారి పాలకవర్గం లేకపోవడంతో ఆ హడావుడి కనిపించకపోవడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.
రెగ్యులర్ ఈవో లేక..
ఆలయం దేవాదాయ శాఖలో విలీనం అయినప్పటి నుంచి రెగ్యులర్ ఈవోను నియమించకుండా ఇన్చార్జి ఈవోతోనే వ్యవహారాలు కొనసాగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. దీంతో ఆలయ అభివృద్ధి పనులు మందగించాయని, సమస్యలు పేరుకుపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం నాణ్యత కూడా తగ్గిందని ఆరోపిస్తున్నారు. ఇన్చార్జి ఈవో అందుబాటులో ఉండకపోవడం, పాలకవర్గం లేకపోవడంతో నిర్వహణ సరిగా లేదని అంటున్నారు. భక్తులు అందించే అన్నదాన విరాళాల లెక్కల విషయంలోనూ పారదర్శకత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోతుల బెడదతో భక్తుల ఆందోళన
ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని భక్తులు చెబుతున్నారు. దర్శనానికి వచ్చేవారిపై కోతులు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయంపై ప్రశ్నలు
గురుపౌర్ణమి వేడుకలకు సంబంధించిన కరపత్రాలు ఆలయ ఇన్చార్జి ఈవోకు సంబంధం లేకుండానే కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముద్రించారనే ప్రచారం జరుగుతోంది. ఆలయ (Datta Sai Baba Temple) వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెరుగుతుండటంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గురుపౌర్ణమి మహోత్సవాలకు ముందే నూతన పాలకవర్గాన్ని నియమించి, రెగ్యులర్ ఈవోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, కోతుల బెడదకు చెక్ పెట్టాలని భక్తులు దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు.
Read Also: డీకోడ్ మిత్ర’తో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విప్లవం
Follow Us On : WhatsApp

