జాతీయ అంశాలపై KCR సైలెంట్.. అయోమయంలో BRS

కలం, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే భారీ వ్యూహంతో ‘తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)’ పేరు ‘భారత రాష్ట్ర సమితి (BRS)’గా మారింది. కొన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. పార్టీ ఆఫీసులూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అస్తిత్వం లేకుండాపోయాయి. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఉన్నా అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. జాతీయ రాజకీయ వ్యూహం తలకిందులైంది. జాతీయ పార్టీగా ఎదగాలని వేసిన అడుగులు చివరికి సొంత గడ్డపైనే అధికారానికి దూరం చేశాయి. పార్టీ మనుగడే సంక్షోభంలో పడింది. జాతీయ రాజకీయాలపై గతంలో భారీ విజన్ వినిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తెలంగాణలో పవర్ పోవడంతో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. నీట్ అవకతవకలు మొదలు కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలపై మౌనంగా ఉండిపోయారు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి జరిగినా ఆయన నుంచి నో రెస్పాన్స్, నో రియాక్షన్. ఒకవైపు జాతీయ స్థాయి పార్టీగా ఎదగాలనే ఆశలు ఆవిరయ్యాయి.. ఇంకోవైపు ప్రాంతీయ పార్టీగా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు ఉన్నాయి.

ఉద్యమ పార్టీగా తెలంగాణ సెంటిమెంట్‌తో రెండు టర్ములు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు పవర్ కోసం ప్రయత్నిస్తున్నది. జాతీయ పార్టీగా మార్చాలన్న హడావుడిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో భారీ సభలు నిర్వహించింది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకున్నది. కానీ, ఆ ఉత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జాతీయ అంశాలపై చురుగ్గా వ్యవహరిస్తామని కేసీఆర్ ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అధికారం పోయాక.. అసలు ఆ ఊసే లేదు. అందుకు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత భారీ ఎత్తున నిరసనలు, పోలీసుల లాఠీచార్జి వంటి అంశాల్లో కేసీఆర్ నుంచి పెద్దగా ఎలాంటి ప్రకటన లేదు.. సంఘీభావమూ లేదు.

  • జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నా, పేరు పెట్టుకున్నా బీఆర్ఎస్ ఎంపీలుగానీ, అగ్రనేతలు గానీ ఢిల్లీలో బాధిత విద్యార్థులను పరామర్శించలేదు. ఆ పోరాటానికి బహిరంగంగా మద్దతు పలకలేదు.
  • ఈనెల 20న ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి జరిగితే.. ఈ నెల 24న హైదరాబాద్లోని ధర్నాచౌక్ ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. యువత కోసం కేసీఆర్ తల్లడిల్లుతున్నారని, వారి కోసం అవసరమైతే బయటకు వస్తారని ప్రకటించారు. కానీ.. కేసీఆర్ బయటకు వచ్చి మద్దతివ్వడమేమిటో కానీ, ముందుగా స్పందించి ఉంటే బాగుండేదన్న చర్చ బీఆర్ఎస్ నేతల్లోనే జరుగుతున్నది.

పేరులో ‘తెలంగాణ’ తీసేయడంతో..!

సొంత రాష్ట్రంలోనే పార్టీ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. పార్టీ పేరును ‘బీఆర్ఎస్’గా మార్చుకోవడంతోనే చిక్కుల్లో పడ్డామనే అభిప్రాయం గులాబీ నేతల్లోనే నెలకొన్నది. ‘తెలంగాణ’ పదాన్ని తొలగించడంతో మూలాలనే తుడిచిపెట్టుకుపోయాయని, తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే వ్యాఖ్యలు సొంత పార్టీ లీడర్ల నుంచే వచ్చాయి. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సైతం పార్టీ పేరు మార్పును తప్పుపట్టారు. కేటీఆర్ సైతం పేరు మార్చకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో, క్షేత్రస్థాయి కార్యకర్తల్లోనూ ఈ అభిప్రాయమే బలంగా నాటుకుపోయింది. తెలంగాణ ఆత్మను తమంతట తామే స్వయంగా వదులుకున్నామనే ఆవేదననూ వినిపించారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రత్యర్థి పార్టీలు దీన్ని రాజకీయంగా వినియోగించుకున్నాయి

ఢిల్లీ నుంచి గల్లీవైపు చూపు

ప్రస్తుతం బీఆర్ఎస్ అటు జాతీయ స్థాయిలో రాణించలేక ఇటు రాష్ట్రంలో బలపడలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్న వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత గులాబీ నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. అధికారం లేకపోవడంతో కేడర్‌ను కాపాడుకోవడం, భరోసా నింపడం అధిష్టానానికి సవాల్గా మారింది. జాతీయ రాజకీయాల ఆత్రుతలో సొంత పునాదులనే బలహీనపరుచుకున్నామనే వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించిందని, మళ్లీ ‘టీఆర్ఎస్’గా మారిస్తే బాగుంటుందనే డిమాండ్లు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

ఢిల్లీ కంటే గల్లీ పునాదులే ముఖ్యమనే వాదనలు గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ స్థాయిలో అస్తిత్వం సాధించలేకపోయినా సొంత గడ్డపై పూర్వవైభవాన్ని సంతరించుకోడానికి మూలాల్లోకి వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. రైతులు, యువత, విద్యార్థుల అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. నిషేధించిన ధర్నా చౌక్‌ వేదికగానే యువతతో కలిసి ధర్నాలో పాల్గొన్నది. జాతీయ రాజకీయాలకు గుడ్బై.. గల్లీలోనే అస్థిత్వ పోరాటం అనే పాలసీతో కార్యాచరణ ప్రారంభించింది.

ఇదీ పరిస్థితి

అక్టోబర్ 2022: టీఆర్ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మార్పు. మహారాష్ట్ర, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు.

డిసెంబర్ 2023: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్. ప్రతిపక్షానికి పరిమితం.

2024 జూన్: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన గులాబీ పార్టీ.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>