విద్యా ఫలితాల్లో నారాయణపేట ప్రథమ స్థానంలో నిలవాలి: కలెక్టర్

కలం ,నారాయణపేట: విద్యా ఫలితాల్లో వచ్చే సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector) అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ సెంటర్ లో ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… శిక్షణ ఎలా జరుగుతోంది, ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో శిక్షణ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. వచ్చే ఏడాది మన జిల్లా విద్యా ఫలితాల్లో మరింత మెరుగైన స్థాయికి చేరుకొని, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఇప్పటి నుంచే మనమంతా కలిసి కృషి చేస్తే ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలం అన్నారు.

రెండు రోజుల క్రితం ధన్వాడ మండలంలోని మందిపల్లి పాఠశాలను సందర్శించడం జరిగిందని, అక్కడ ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు ఎంతో చక్కగా బోధించడం చూశానని, పిల్లలతో నిరంతరం సంభాషిస్తూ, పాటలు, మ్యాప్‌లు వంటి బోధనా సామగ్రిని ఉపయోగించి, వారు మరచిపోకుండా నేర్పించడం ప్రధానం అన్నారు. పిల్లలు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడమే ముఖ్యమైన లక్ష్యం అని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమంలో ఇంగ్లీష్, గణితం వంటి ప్రాథమిక అంశాలు ఎంతో కీలకం అన్నారు. ఈ బలమైన పునాదిపైనే వారి భవిష్యత్తు విద్య నిర్మాణం జరుగుతుందన్నారు.

అందుకే ప్రతి ఉపాధ్యాయుడు బోధనను మరింత ఆసక్తికరంగా, పిల్లల భాగస్వామ్యంతో నిర్వహిస్తే వారు నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ మర్చిపోరనీ, పిల్లలు టీవీలో చూసిన పాటలు, సినిమాలు ఎందుకు గుర్తుంచుకుంటారంటే, అవి వారి మనసులో బలంగా ముద్రపడతాయని చెప్పారు. అదే విధంగా వీడియోలు, డిజిటల్ పాఠాలు, ఆన్ లైన్ బోధనా వనరులను కూడా ఉపయోగిస్తే వారు త్వరగా అర్థం చేసుకుని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్నారు.

ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మనం కొత్త పద్ధతులను నేర్చుకుంటామని, ప్రతిరోజూ ఒకే విధంగా బోధించడం కాకుండా, కొత్త ఆలోచనలు, వినూత్న బోధనా పద్ధతులు, బోధనా సామగ్రిని ఉపయోగించడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కొంత అదనపు శ్రద్ధ, సమయం, శక్తి కేటాయించడం చాలా అవసరం అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్ల మధ్య నుంచి వస్తుంటారని తెలిపారు.

భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఒక విషయం చెబుతుంటానని, తల్లిదండ్రులు చెప్పిన మాట కంటే, ఉపాధ్యాయులు చెప్పిన మాటనే పిల్లలు ఎక్కువగా నమ్ముతారన్నారు. ఒక విద్యార్థికి “నువ్వు చేయలేవు” లేదా “నీకు మార్కులు రావు” అని చెప్పితే, అతను అదే నిజమని నమ్మి ముందుకు సాగలేడనీ, నా జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉంది అని ఆమె గుర్తు చేశారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాట పిల్లల మనసులో బలంగా నిలిచిపోతుందని,
అందుకే మీరు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. భాషలోనూ, ప్రవర్తనలోనూ, బోధనలోనూ మీరు సరైన ఉదాహరణగా ఉండాలనీ సూచించారు.
మన నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ, ఇక్కడ ఎంతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, మంచి విద్యార్థులు ఉన్నారనీ, అందువల్ల మీ బాధ్యత కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నారు.

మీ అందరూ ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో పూర్తిగా అమలు చేస్తారని ఆశిస్తున్నానని, జిల్లా యంత్రాంగం కూడా మీకు అవసరమైన ప్రతి విషయంలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఎఫ్ ఎల్ ఎన్ సర్వేలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు ను కలెక్టర్ శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్ కోటి, ఎం ఇ వో కరిముల్లా, ఏ ఎం వో విద్యా సాగర్, మాస్టర్ ట్రైనీ లు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

నారాయణపేట మండలంలోని లింగంపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన దారిలో రూ.200 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను శనివారం జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. అగ్రిమెంట్ ప్రకారం 2027 జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజక వర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మింప చేయిస్తోందని, అందులో భాగంగానే నారాయణపేట నియోజక వర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఇక్కడి లింగంపల్లి గ్రామ సమీపములో నిర్మించడం జరుగుతోందని తెలిపారు. స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.

స్కూల్ నిర్మాణంలో 4 అకాడమిక్ బ్లాక్‌లు, ఒక సీనియర్ డార్మిటరీ ,ఒక జూనియర్ డార్మిట్, ఒక వంటగది, భోజనశాల, ప్రధాన నివాస గృహం, రెండు సింగిల్ క్వార్టర్లు, 6 డబుల్ & సంప్ లు, తల్లిదండ్రుల లాంచ్ ఉంటాయని టీజీ ఈ డబ్ల్యూ ఐ డీ సీ డీ.ఈ.ఈ వెంకట్ రెడ్డి మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. పనుల్లో వేగం పెంచి అగ్రిమెంట్ ప్రకారం స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>