ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభపరిణామం: పోలాడి రామారావు

కలం, కరీంనగర్: నీట్ అక్రమాలపై దేశ రాజధానిలో నెల రోజులుగా విద్యార్థులు చేసిన అలుపెరగని ఆందోళనల ఫలితంగానే.. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో (Dharmendra Pradhan) రాజీనామా చేయించడం మంచి నిర్ణయమని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఉద్యమం ఆలస్యమైతే అరాచక శక్తులు ప్రవేశించి పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉండేదని మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు.

నిర్బంధాలతో ప్రజల గొంతును నొక్కలేరని మరోసారి రుజువైందని పోలాడి రామారావు అన్నారు. విద్యార్థుల న్యాయమైన ఆందోళనలపై పాలకుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే దేశ రాజధానిలో యువత, విద్యార్థుల ఉద్యమం ఉధృత స్థాయికి చేరిందని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.

ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జరుగుతున్న ఆలస్యంతో నిరుద్యోగ యువత వయోపరిమితి దాటి ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ నిరాశకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాల నాయకులు కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, విక్రమ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>