కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసు నుంచి తన కొడుకుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో సీదిరి కుమారుడు నిందితుడిగా ఉండగా, అతడిని కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రిపై కూడా కేసు నమోదైంది. అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు సమయంలో సీదిరి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అప్పలరాజు కొడుకు అరవ్ వర్మ బైక్ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు సీదిరి అప్పలరాజును ఏ3 గా చేర్చారు.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన సోంపేట కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

