కలం, వెబ్ డెస్క్ : మహిళా ఐపీఎస్ అధికారిణి చేసిన ఆరోపణలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయం నుండి తామిద్దరం ప్రేమలో ఉన్నామని, మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా గడిపామని పేర్కొన్నారు. సర్వీస్‌లోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని కూడా పరస్పరం నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అయితే, తనకు మరో యువతితో సంబంధం ఉందనే తప్పుడు అనుమానంతో ఆమె గత మే నెలలో ఒక ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుందని ఉదయ్ కృష్ణారెడ్డి వివరించారు. ఆ తర్వాత హైదరాబాద్ అకాడమీకి వచ్చాక, తనపై ఉన్న అనుమానాలు తప్పని తెలుసుకుని ఆమె మళ్లీ తన గదికి వచ్చిందని వెల్లడించారు. గతంలో ఉన్న సంబంధాన్ని తిరిగి కొనసాగించాలని ఆమె కోరినప్పటికీ, అప్పటికే ఆమెకు వివాహం జరగడంతో తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టం చేశారు.
తాను నిరాకరించినప్పటికీ వినకుండా ఆమె తరచూ ఫోన్లు చేయడం, తన గదికి రావడం చేసేదని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి నిలదీయడంతో, తప్పించుకోవడానికి తానే ఆమెను వేధిస్తున్నట్లు అబద్ధం చెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె భర్త తనకు ఫోన్ చేసి ప్రశ్నించగా, గతంలో తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించినా నమ్మలేదన్నారు. దాంతో ముస్సోరిలో తామిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోను ఆధారంగా ఆమె భర్తకు పంపించానని, ఆ కారణంగానే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తనపై పగ పెంచుకుని, పోలీసులకు తప్పుడు ఆరోపణలతో అక్రమంగా ఫిర్యాదు చేసిందని, కాబట్టి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఉదంతంపై చికిత్స అందిస్తున్న వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆయన ఎలాంటి విషపదార్థాలు తీసుకోలేదని, కేవలం పరిమితికి మించి మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయారని స్పష్టం చేశారు. ల్యాబ్ రిపోర్టుల్లోనూ కేవలం ఆల్కహాల్ మాత్రమే ఉన్నట్లు తేలిందని వైద్యులు వివరించారు. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ గురించి ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy)ని ప్రశ్నించగా, తాను మద్యం మత్తులో ఆ నోట్ రాసి ఉండవచ్చని, అసలు ఆ లేఖ రాసిన విషయమే తనకు గుర్తులేదని వైద్యులకు తెలిపినట్లు సమాచారం.
Read Also: మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.. భట్టి డిమాండ్
Follow Us On : WhatsApp

