కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలోని సర్వే నెం. 1 కి సంబంధించిన 150 ఎకరాల భూ బాధితులైన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు రైతులతో కలిసి ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో ఈ భూమిని హెచ్ఎండిఏ కి కేటాయించినప్పటికీ, నేటి వరకు రైతులకు ఎలాంటి ప్లాట్లు లేదా సరిహద్దులు కేటాయించకపోవడం వల్ల రైతులు తీవ్ర అ అభద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వే నంబర్ 1 ని ధరణి పోర్టల్ నుండి తొలగించడం వల్ల గత నాలుగేళ్లుగా రైతుబంధు, రైతుబీమా వంటి కీలకమైన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక రైతులు అకారణంగా నష్టపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ఈ భూమిని టీజీఐఐసి కి బదిలీ చేయాలని కలెక్టర్ ను కొరారు.

