కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్(Karimnagar CP) గౌష్ ఆలం (Gaush Alam) మంగళవారం ఇల్లందకుంట (Ellanthakunta) మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల అవగాహన, రోడ్డు భద్రత, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదట ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను సీపీ ప్రారంభించారు. గ్రామాలలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించాలని కోరారు.
అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, నేడు నాటే మొక్కలే భవిష్యత్ తరాలకు జీవనాధారంగా నిలుస్తాయని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లతో ముద్రించిన ఎగ్జామ్ ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యతో పాటు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర పరిస్థితులలో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసిన సీపీ, హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణ రక్షణకు అత్యవసరమని తెలిపారు.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, పోలీస్–ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాలలో మాదకద్రవ్యాలు, జూదం, సైబర్ మోసాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. తదుపరి ఇల్లందకుంట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన సీపీ, కిట్ ఇన్స్పెక్షన్, పెండింగ్ ఫైళ్లు, కోర్ పోలీసింగ్, చట్ట అమలు, క్రైమ్ వెహికల్స్, క్రైమ్ ప్రాపర్టీ, రికార్డులు, ప్రభుత్వ ఆస్తులు, కేసుల దర్యాప్తు తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచడంతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రతిపాదిత ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించిన సీపీ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, కార్యాలయ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ ఫైళ్లు, పోలీసింగ్ పనితీరును సమీక్షించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఇల్లందకుంట ఎస్ఐ ఎం. క్రాంతికుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

