కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పేరిట నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ అండదండలతో మాఫియా చెలరేగిపోతూనే ఉంది. నెలకు లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం వస్తుండటంతో కొందరు అధికారులు వీరికి సహకరిస్తున్నారు. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలోని పెద్దవాగు, కప్పలవాగు పరివాహక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా (Illegal Sand Mining) జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
రోజూ వందల ట్రిప్పులు..
బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలోని మెండోరా, ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్, భీంగల్ మండలాల్లోని వాగుల పరివాహక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతోంది. మెండోరా మండలం వెల్కటూరు వాగు నుంచి ఒక్క నెలలోనే ట్రాక్టర్ల ద్వారా రూ.28 లక్షల వరకు వసూళ్లు చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో వెల్కటూరు వాగు నుంచి నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు నిత్యం వందల ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలించినట్లు (Illegal Sand Mining ) సమాచారం.
ఒక్కో ట్రిప్పుకు రెవెన్యూ శాఖ పేరుతో రూ.400 చొప్పున వసూలు చేయగా, పోలీస్ శాఖకు సంబంధించిన వసూళ్లు దీనికి అదనం. ఈ వివరాలను బట్టి అక్రమ ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. అందుకే వాగు పరివాహక ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం కొందరు అధికారులు ఆసక్తి చూపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ విచారణలో బట్టబయలు..
ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల విచారణకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ అనుమతులు ఇచ్చిన విషయం వాస్తవమేనని విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మెండోరా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానందాన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి మరింత విచారణ కొనసాగుతోంది.
అంతటా ఇదే తంతు..
బాల్కొండ నియోజకవర్గంలోని పలు వాగుల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లోని వాగుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఏదో ఒకచోట ఇసుక అక్రమ రవాణా వాహనాలు పట్టుబడుతున్నాయి.
తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనూ అక్రమాలు వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: శ్రావణంలో కమల వ్యూహం.. గురి ఎవరిపై?
Follow Us On : WhatsApp

