కలం, జోగులాంబ గద్వాల : సుఖ ప్రసవం కోసం పుట్టినింటికి వెళ్తున్న ఓ గర్భిణిని మరణం వెంటాడింది. నాలుగు నెలల్లో పండంటి పసి ప్రాణానికి జీవం పోయాల్సిన ఆ తల్లి విధి ఆడిన వింత నాటకంలో తన ప్రాణాలు కోల్పోయింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పరిధిలోని పుల్లూర్ టోల్ ప్లాజా సమీపంలో 44వ జాతీయ రహదారిపై గల పంచలింగాల (Panchalingala) (కర్నూల్ జిల్లా) స్టేజి సమీపంలో ఏపీ ఆర్టీసీ బస్సు ఒక బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న ఐదు నెలల గర్భిణి చాకలి ప్రియాంక (24) తలపై నుంచి బస్సు టైరు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న ఆమె తండ్రి రాముడికి తీవ్ర గాయాలవడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చాకలి ప్రియాంకకు 2021లో నంద్యాల జిల్లా మిడివేముల గ్రామానికి చెందిన చిన్నబజారు అనే వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఐదు నెలల గర్భంతో ఉన్న ప్రియాంకను, ఆమె తండ్రి రాముడు బైక్‌పై పుట్టింటికి తీసుకువస్తుండగా పంచలింగాల (Panchalingala) స్టేజ్(కర్నూల్ జిల్లా) సమీపంలో అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రియాంక అక్కడికక్కడే కన్నుమూయగా, కడుపులోని ఐదు నెలల బిడ్డ కూడా గర్భంలోనే ప్రాణాలు విడిచింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరు పెట్టిస్తున్న కుటుంబ నేపథ్యం..
ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రియాంక గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మద్దూరు గ్రామానికి చెందిన రాముడికి ముగ్గురు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఇద్దరూ మతిస్థిమితం కోల్పోయి జీవిస్తున్నారు. రెండో కుమార్తె ప్రియాంక మాత్రమే ఆ తండ్రికి కొండంత అండ.
ఐదేళ్లుగా పిల్లలు లేని ప్రియాంక గర్భం దాల్చడంతో, సుఖ ప్రసవం కోసం తండ్రి ఎంతో ఆశగా కూతురిని పుట్టింటికి తీసుకువస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించింది. కళ్లముందే హుషారుగా ఉన్న కూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి, తీవ్ర గాయాలతో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆ తండ్రి గుండె పగిలేలా రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కన్నీరు పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also: కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

