కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లా .. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Medak Congress)కి కంచుకోట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ బలం పుంజుకొని మెజారిటీ స్ధానాల్లో విజయం సాధిస్తుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏడు , కాంగ్రెస్ మూడు ఎమ్మెల్యేల సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ముగ్గురికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ కార్పొరేషన్ల పదవులను ఇచ్చారు.
సంగారెడ్డి నుండి గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డికి అత్యంత కీలకమైన టీజిఐఐసీ చైర్మన్ పదవి వరించింది. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన గిరిధర్ రెడ్డికి సెట్విన్ చైర్మన్ పదవిని , ఫహీమ్ కు పుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా కేటాయించారు. అయితే ఈ ముగ్గురు కుడా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. సెట్విన్ చైర్మన్ పదవికాలం మరో ఏడాది ఉండగా .. నిర్మలా జగ్గారెడ్డి, ఫహీమ్‌ల పదవికాలం పూర్తయింది.
ఆశావహులు ఎక్కువే!
పదవి కాలం ముగిసిన కార్పొరేషన్ల చైర్మన్ పదవులను ఈ నెలఖారు లోగా భర్తీ చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు వివిధ మార్గల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే నామినేటెడ్ పదవులను సాధించడమే లక్ష్యంగా పావులు కదువుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఇష్యూ లేకుండా నామినేటెడ్ పదవులను నాయకులు అశిస్తున్నారు.
ఈ క్రమంలోనే పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ,మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పోటిదారులుగా ఉన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పటాన్ చెరులోని అభ్యర్థికి నామినెటెడ్ పదవి ఇస్తే మహిపాల్ రెడ్డిని ఎదుర్కొగలమని కాంగ్రెస్ పార్టీ భావిస్తునట్టు తెలుస్తుంది . సంగారెడ్డి అసెంబ్లీ నుండి మళ్లీ నిర్మల జగ్గారెడ్డి , జహీరాబాద్ నుండి గిరిధర్ రెడ్డి , ఉజ్వల్ రెడ్డి ఆశావహులుగా ఉన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి అవుల రాజిరెడ్డి ,మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ , దుబ్బాక నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు కూడా నామినెటెడ్ పదవులను అశిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా పార్టీ సీనియర్ నాయకులు సైతం తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంను కోరుతున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు అధిష్టానం ను కలిస్తే , సానుకూల స్పందన రావట్లేదని అనుచరులు దగ్గర వారు చెప్పకుంటున్నారు. దీంతో ప్రసుత్త పరిస్థితుల్లో ఎవరికి పక్కాగా నామినేటెడ్ పదవి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్ధితి ఉంది. అధిష్టానం ప్రకటించబోయే చైర్మన్ పదవులపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో అనిశ్చితి నెలకొంది.
పాత వారికే రెన్యూవల్స్?
అయితే రాష్ట్ర రాజకీయ సమీకరణాల దృష్ట్యా , కాంగ్రెస్ ప్రభుత్వం రెండసారి ప్రకటించబోయే నామినేటెడ్ పదవుల భర్తీలో మళ్లీ పాత వారికే చైర్మన్ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని ఊహాగానాల విన్పిస్తున్నాయి. అలా ఉమ్మడి మెదక్ జిల్లా కోటాలో కాంగ్రెస్ కీలకనేత జగ్గారెడ్డి భార్య నిర్మల , మైనార్టీ నేత ఫహీమ్‌లు పదవులకు మళ్లీ తప్పక రెన్యూవల్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సెట్విన్ గిరిధర్ రెడ్డి కి మరో ఏడాది పదవి కాలం ఉన్నది. జిల్లా పరిస్థితుల నేపధ్యంలో ఈ దఫా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కొత్త వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కష్టంగా కన్పిస్తుంది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ,కొత్తగా ఎవరికి పదవులు ఇచ్చిన మిగితా వారి నుండి సమస్యలు ఎదురై లేనిపోని తప్పనొప్పులు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. దీంతో మళ్లీ పాత వారి వైపు మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. రెన్యూవల్స్ కు రెడీ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన నాయకులకు గుర్తించి ,పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని పలువురు నాయకులు కోరుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి ,పార్టీ మళ్లీ అధికారంలోకి రావలంటే ..పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానంను డిమాండ్ చేస్తున్నారు.

