కలం, వెబ్ డెస్క్: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. పార్ట్‌టైమ్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక టెక్కీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తక్కువ వడ్డీకే ఆన్లైన్ లోన్లు ఇస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న (Online Loan Fraud) ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా, తక్కువ వడ్డీకే ఆన్లైన్ లోన్ ఇస్తామనే ఒక ప్రకటన కనిపించింది. దాన్ని నమ్మి ఆయన ఆ లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి ప్రవీణ్‌కు వాట్సాప్ కాల్ చేశారు. లోన్ మంజూరు చేస్తామని నమ్మబలుకుతూ.. ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ముందస్తు ఈఎంఐ, సర్వీస్ చార్జీల పేరుతో విడతల వారీగా రూ.17,951 వసూలు చేశారు. డబ్బులు చెల్లించినా ఎంతకీ రుణం మంజూరు కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవీణ్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ప్రవీణ్ లాగే దేశవ్యాప్తంగా మరో 30 మందికి పైగా బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సైబర్ నేరాల వెనుక హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన తలారి ఆకాష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఆకాష్‌తో పాటు మరో నలుగురు కలిసి ఈ ముఠాగా ఏర్పడి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. దీనితో పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ తలారి ఆకాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగతా నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

