కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadrachalam Kothagudem) జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 44 వాహనాలను గుర్తించి, వాహనదారుల సమక్షంలోనే అక్కడికక్కడే కొత్త నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా రూ. 15,475 పెండింగ్ చలానాలను వసూలు చేసిన డీఎస్పీ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులను కోరారు. మరోవైపు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో పాల్వంచ కేఎల్ఆర్ కాలేజ్ బస్సు డ్రైవర్ భాస్కర్, కొత్తగూడెం ఎస్ఆర్డిజి జూనియర్ కాలేజ్ బస్సు డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెట్టిన ఈ ఇద్దరు డ్రైవర్లపై మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద కేసులు నమోదు చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులు మొత్తం 185 కేసులను నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

