కలం, యాదగిరిగుట్ట: బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసిత గ్రామమైన లప్ప నాయక్ తండా వాసులకు ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్లు, ప్లాట్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) స్పష్టం చేశారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండా, రాళ్ల జనగాం గ్రామాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ నిర్వహించి, ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
మౌలిక వసతుల కల్పనపై సమీక్ష..
తండా వాసుల కోసం దాతర్‌పల్లి సమీపంలో కేటాయించిన పునరావాస స్థలాన్ని విప్ అయిలయ్య పరిశీలించారు. అక్కడ జరుగుతున్న లే అవుట్, మౌలిక వసతుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివాస స్థలాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జొన్న రొట్టె, సోలాయ్‌తో అల్పాహారం..
మార్నింగ్ వాక్ ముగించుకున్న అనంతరం విప్ బీర్ల అయిలయ్య తండా వాసులతో కలిసి అల్పాహారం చేశారు. గిరిజనుల సాంప్రదాయ ఆహారమైన జొన్న రొట్టె, సోలాయ్‌ను ఎంతో ఇష్టంగా ఆరగించారు. తండా వాసుల ఆత్మీయ ఆతిథ్యం, సంప్రదాయ వంటకాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం రాళ్ల జనగాం, లప్ప నాయక్ తండా గ్రామాల్లో కొత్త వాటర్ ప్లాంట్‌లను ప్రారంభించారు.
ఈ ప్లాంట్ ద్వారా లీటరుకు అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఉదయాన్నే తండాకు విచ్చేసిన విప్ బీర్ల అయిలయ్యకు లప్ప నాయక్ తండా వాసులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

