ప్రభుత్వాస్పత్రిలో పర్సనల్​ వేడుకలు..!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద రోగులకు ప్రాణం పోసే ప్రాంగణం. అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఓ ఉన్నతాధికారి తన సొంత ఇళ్లు లా భావించి వ్యక్తిగత వేడుకలకు వేదికగా మార్చుకోవడం ఖమ్మం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఖమ్మం జిల్లా మధిర ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో (Madhira Govt Hospital) చోటుచేసుకున్న ఈ వివాదాస్పద ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. విధి నిర్వహణలో ఉండి రోగులకు సేవ చేయాల్సిన సమయంలోనే.. ఆమె తన అధికారిక ఛాంబర్‌ను వేదికగా మార్చేసి, తన కూతురు, అల్లుడికి అత్యంత వైభవంగా సీమంతం వేడుకను నిర్వహించారు. అనంతరం నర్సింగ్ స్టాఫ్ రీల్స్ కూడా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆసుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది కూడా హాజరయ్యారు. తాము చేయాల్సిన వైద్య విధులను పక్కనబెట్టి, వారంతా ఈ వేడుకల్లోనే పూర్తిగా నిమగ్నమైపోయారు. ​ప్రభుత్వ కార్యాలయాన్ని, అందునా రోగులకు సేవలు అందించాల్సిన ఆసుపత్రి ప్రాంగణాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యవసర వైద్యం కోసం వచ్చే నిరుపేద రోగులకు ఈ వేడుకల వల్ల తీవ్ర అంతరాయం కలిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యతాయుతమైన ఉన్నత హోదాలో ఉన్న అధికారి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులకు ఒడిగడితే, కింది స్థాయి సిబ్బందికి ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ వివాదాస్పద ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘించి ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చిన వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>