పంట మార్పిడితో రైతుల‌కు లాభాలు: కలెక్టర్ భవేష్ మిశ్రా

క‌లం, నిర్మ‌ల్‌: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో రైతులు సంప్రదాయ సాగుకు బదులుగా పంటల మార్పిడి చేపట్టి, తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో జూలై నెలలో సుమారు 30 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ముఖ్యంగా సోన్ మండలంలో 50 శాతం వరకు వర్షాభావం ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో సుమారు 4.30 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందన్నారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి నాట్లు వేయాలని, సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్‌పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఒక ఎకరంలో కంది పంట ద్వారా 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించి రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. వరి సాగు వల్ల నీటి కొరత కారణంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుపై రైతుల్లో అవగాహన పెరుగుతోందని, గతంలో 400 ఎకరాల్లో ఉన్న సాగు విస్తీర్ణం ఈ ఏడాది 1,200 ఎకరాలకు పెరిగిందని తెలిపారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50 శాతం రాయితీ అందుబాటులో ఉందని చెప్పారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని వివరించారు.

రైతులకు అవసరమైన సలహాలు, సాంకేతిక మార్గదర్శకాలు అందించేందుకు 89777 51785 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>