కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల పట్టణ పోలీసులు (Jagtial Police) మానవతా దృక్పథంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్లు, బస్టాండ్ పరిసరాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో సంచరిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది మానసిక అస్వస్థత కలిగిన వ్యక్తులను (Mental Health Patients) గుర్తించి సురక్షితంగా రెస్క్యూ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
రక్షించిన వ్యక్తులపై మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్–2017 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల నివేదికల ఆధారంగా వారి మానసిక ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తదుపరి చికిత్స, సంరక్షణ కోసం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వీధుల్లో తిరుగుతున్న వారిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్య సహాయం అందించడం పోలీసుల సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన వైద్యం, సంరక్షణ అందేలా జగిత్యాల పోలీసులు నిరంతరం చర్యలు కొనసాగిస్తారని తెలిపారు.

