కలం, వెబ్ డెస్క్ : “మాకు న్యాయం చేయండి, లేదంటే మా ప్రాణాలు తీసుకోండి” అంటూ మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రజలు రోడ్డుకెక్కారు. కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (Ken-Betwa Link Project)కు వ్యతిరేకంగా ఛతర్పూర్, పన్నా జిల్లాల్లోని ఆదివాసీ తెగలు ‘చితా ఆందోళన’ (Chita Andolan) పేరిట ఉధృతమైన నిరసనలు చేపడుతున్నారు. తమ జీవిత కాలపు నివాసాలు, సంస్కృతి, జీవనోపాధిని దూరం చేసే ఈ ప్రాజెక్టు ముంపు తమకు సజీవ సమాధితో సమానమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన దౌధన్ ఆనకట్ట (Daudhan Dam) కారణంగా దాదాపు 22 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల 7,000 పైగా గిరిజన కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారు. ప్రాజెక్టు పనులను అడ్డుకుంటూ నదీ తీరాల్లో పురుషులు, మహిళలు, వృద్ధులు సైతం నేలపై పడుకుని, ప్రాణాలను పణంగా పెట్టి నిరసనలు తెలుపుతున్నారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ గిరిజన సంఘాలు తెగేసి చెబుతున్నాయి. ఈ ఆందోళనలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.

