కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ (Saidabad Success School ) లో హిందూ విద్యార్థికి ఓ టీచర్ ‘కల్మా’ను హోంవర్క్‌గా ఇవ్వడంపై తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సదరు స్కూల్ ప్రాంగణంలో హిందూ సంఘాలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వివాదానికి కారణమైన టీచర్ ను తొలగించినట్లు ప్రకటించిన పాఠశాల యాజమాన్యం.. తాజాగా ఆమె ఉద్యోగ తొలగింపుకు సంబంధించిన ఉత్తర్వులను రిలీజ్ చేసింది.
ఈ వివాదానికి కారణమైన షేక్ ఆయిషా పర్వీన్ అనే టీచర్‌ను నేటి నుంచి తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పాఠశాల యాజమాన్యం పేర్కొంది. అంతేకాదు భవిష్యత్ లో సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలలో ఎటువంటి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఆమెకు శాశ్వతంగా అర్హత ఉండదని స్పష్టం చేసింది. ఇది టీచర్ చేసిన పొరపాటుగా తాము భావిస్తున్నామని , అయినప్పటికీ తమ విద్యాసంస్థలో ఇలాంటి ప్రవృత్తి సహించేది లేదంటూ సదరు టీచర్ ను తొలగించినట్లు అంతకుముందు పాఠశాల యాజమాన్యం తన ప్రకటనలో వెల్లడించింది.

