పోలీసులకు అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ కొడుకు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. గతంలో కలెక్టర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసి, రిటైర్మెంట్ తర్వాత గులాబీ పార్టీలో చేరి ఎమ్మెల్సీ (BRS MLC) పదవి దక్కించుకున్న ఓ సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. ఆ మధ్య తన కుమారుడి వివాహ వేడుకను కోట్లాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేసి విలాసవంతంగా, భారీ ఎత్తున నిర్వహించి వార్తల్లో నిలిచిన సదరు ఎమ్మెల్సీకి ఇప్పుడు తన కొడుకు భరత్ రాజ్ రూపంలోనే ఊహించని షాక్ తగిలింది. తాజాగా సదరు ఎమ్మెల్సీ పుత్రరత్నం డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పరిధిలో నిన్న రాత్రి కొందరు యువకులు డ్రగ్స్ మత్తులో తేలుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు హఠాత్తుగా దాడులు (Hyderabad Drug Bust) నిర్వహించారు. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కుమారుడు (BRS MLC Son) భరత్‌తో పాటు మరో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారు డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ కావడంతో పోలీసులు ఎమ్మెల్సీ కొడుకు భరత్ రాజ్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ హైప్రొఫైల్ కేసును పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై జరిగిన దాడి, అక్కడ నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు ఎంపీ, టీడీపీ నేత సహా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఆ వివాదం నుంచి పార్టీ ఇంకా పూర్తిగా తేరుకోకముందే, ఇప్పుడు మళ్లీ గులాబీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ కుమారుడు మంగళ్‌హాట్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కవ్వడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ ఘటనతో హైదరాబాద్ నైట్‌లైఫ్, డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై పోలీసులు నిఘాను మరింత ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>