ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌ నినో ప్రభావం, ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, వర్షాల ఆలస్యం.. వంటి కారణాలతో జూలై నెలలో విద్యుత్ వినియోగం (Telangana Electricity ) గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే కరెంటు వాడకం ఏడున్నర శాతం పెరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాల వినియోగంతో పోలిస్తే హైదరాబాద్ పరిధిలో దాదాపు 12% పెరిగింది.

అయితే భారీ డిమాండ్ ఏర్పడినా సరఫరాలో తేడాలు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నామని టీజీఎస్పీడీసీఎల్ డిస్కం సీఎండీ జితేష్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నుంచి 14వ తేదీ మధ్య టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,510.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైందన్నారు. గతేడాది ఇదే నెల రెండు వారాల్లో ఇది 2,338.79 మిలియన్ యూనిట్లేనని, ఈసారి అదనంగా 171.44 మిలియన్ యూనిట్లు వినియోగమైందని జితేష్ పేర్కొన్నారు.

గ్రేటర్ లో భారీగా..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది 957.79 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే ఈసారి 1,071.94 మిలియన్ యూనిట్లు దాటిందని జితేష్ పాటిల్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉందన్నారు. వర్షాకాలంలో విద్యుత్ వినియోగం తగ్గుముఖం పడుతుందని, కానీ ఈ ఏడాది ఉక్కపోత, అధిక తేమ, వర్షాలు ఆలస్యం కావడం.. ఇలాంటి కారణాలతో గృహ, వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, ఫ్యాన్లు వంటివాటితో వినియోగం పెరిగిందని వివరించారు.వ్యవసాయ రంగంలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. పెరిగిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తగినంత విద్యుత్‌ను సమకూర్చిందని, విద్యుత్ కొనుగోళ్లు, సబ్‌స్టేషన్ల సామర్థ్య పెంపు, ట్రాన్స్‌ ఫార్మర్ల నిర్వహణ, ఫీడర్ల పర్యవేక్షణ, లోడ్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్ బలోపేతం వంటి చర్యలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు.

బోనాలకు నిరంతర సరఫరా

ఆషాఢ బోనాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంటుందని సీఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే బోనాల ఉత్సవాల్లో గోల్కొండ, బాల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ, హరిబౌలి తదితర ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు వివరించారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు ముందస్తు తనిఖీలు పూర్తి చేశామని, 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు టీమ్‌లను నియమించామన్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు మొబైల్ ట్రాన్స్‌ ఫార్మర్లను కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>