న్యూఢిల్లీ: దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు (India Weather) నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వానలు కురవడం లేదు. ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. ఈ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 9.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 6.51 సెంటీమీటర్లు కాగా, అంతకంటే 42 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షం కురవగా, మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం, లడఖ్ ఉన్నాయి. దక్షిణాదిలో ఒక్క కర్నాటకలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ఐదు రాష్ట్రాల్లో లోటు..
జులై మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. తెలంగాణ 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.75 సెంటీమీటర్లు కాగా, కేవలం 3.45 సెంటీమీటర్ల వర్షపాతమే రికార్డయింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 2.93 సెంటీమీటర్లు కాగా, కేవలం 1.61 సెంటీమీటర్ల వర్షపాతమే రికార్డయింది. అదే విధంగా పుదుచ్చేరిలో 66%, అస్సాంలో 59%, లడఖ్‌లో 57%, తమిళనాడులో 56%, పశ్చిమ బెంగాల్‌లో 26% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.
ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
- దక్షిణాదిన జులై మొదటి వారంలో భారీ వర్షాలు కురిశాయి. ఐదు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
- ఒడిశాలో 192%, మహారాష్ట్రలో 147%, గుజరాత్‌లో 133%, చత్తీస్‌గఢ్ 102%, మధ్యప్రదేశ్ 89% చొప్పున సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది.
- కర్నాటక, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలోనూ సాధారణం కంటే ఎక్కువ.. కేరళ, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది.
- బిహార్, మేఘాలయా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్రమైన లోటు వర్షపాతం ఏర్పడింది.
వానలకు వారం బ్రేక్!
ఉత్తరాదిలో గత వారం పాటు కురిసిన వానలకు బ్రేక్ పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు తరలి వెళ్తున్నదని వెల్లడించింది. ఈ కారణంగా హిమాలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా రాష్ట్రాల్లో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ఈ రాష్ట్రాల్లో విపరీతమైన ఉక్కపోత ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రైతుల్లో ఆందోళన
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంటరై నెలన్నర దాటినా.. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. కొన్ని జిల్లాల్లో అడపాదడపా మోస్తరు వర్షాలు కురిశాయో తప్ప, ఎక్కడా పెద్దగా భారీ వానలు కురిసిన దాఖలాలు లేవు. కనీసం రెండు మూడు రోజులు ముసురు కూడా పెట్టలేదు. జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలోనూ చినుకు పడలేదు. ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు వేసిన రైతులు.. వానల కోసం కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వాన దేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.

