కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో ఉన్న తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్దరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో అపార్ట్మెంట్ ప్రధాన గేటు తాళాన్ని కట్టర్తో కట్ చేసి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు వరుసగా రెండు ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకున్నారు.
దుండగులు ముందుగా 303 నంబర్ ఫ్లాట్ తలుపు ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దొంగలు ఇంట్లోని అల్మారాలు, కబోర్డులను గాలించినా విలువైన వస్తువులు లభించలేదు. అనంతరం 207 నంబర్ ఫ్లాట్లోకి ప్రవేశించి, ఇంట్లో ఉన్న వారిని కత్తులతో బెదిరించి సుమారు 20 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనాస్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.

