కలం, న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ (E20 Petrol)వాడటం వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఇది చిన్న ఇబ్బంది మాత్రమేనని, ఇథనాల్ బ్లెండింగ్ తో ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. ఇంజిన్ సామర్థ్యం పెరగడంతో పాటు కర్బన ఉద్గారాలు భారీగా తగ్గుతాయని తెలిపింది. ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం ‘సందేహాలు-సమాధానాలు’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ కంపెనీలతో సంప్రదింపుల తర్వాతే దశలవారీగా ఈ20 విధానాన్ని అమలు చేసినట్లు తెలిపింది.
1. ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గుతుందా?
అవును, కొన్ని రకాల వాహనాల్లో మైలేజీ సుమారుగా 3% నుంచి 5% వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే, మైలేజీ అనేది కేవలం పెట్రోల్ రకంపైనే కాకుండా డ్రైవింగ్ అలవాట్లు, టైర్ల ప్రెషర్, ఏసీ వాడకం, సమయానికి సర్వీసింగ్ చేయడంపై కూడా ఆధారపడి ఉంటుంది.
2. ఇథనాల్ కలపడం వల్ల ధరలు ఎందుకు తగ్గట్లేదు?
ప్రస్తుతం మొక్కజొన్న ద్వారా తయారుచేసే ఇథనాల్‌ను లీటరుకు సుమారు రూ.71.86 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. దీనికి జీఎస్టీ, రవాణా, నిల్వ ఖర్చులు అదనం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 70 డాలర్లు ఉన్నప్పుడు, సాధారణ పెట్రోల్ కంటే ఈ20 పెట్రోల్ (E20 Petrol) ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది. ముడి చమురు ధరలు బ్యారెల్ కు 120-130 డాలర్ల పైకి చేరినప్పుడు మాత్రమే ఇథనాల్ చౌకైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఇథనాల్ బ్లెండింగ్ ఉద్దేశం ధరలను తగ్గించడం కాదు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం.
3. పెట్రోల్ బంకుల్లో ప్యూర్ పెట్రోల్, ఈ10, ఈ20లో మనకు నచ్చినదాన్ని ఎంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు?
దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఒకేసారి మూడు వేర్వేరు రకాల బేస్ ఇంధనాలను సరఫరా చేయడం, నిల్వ ఉంచడం లాజిస్టిక్స్ పరంగా చాలా ఖరీదైంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.
4. ఈ20 పెట్రోల్ వాడటం వల్ల పాత వాహనాల ఇంజిన్లు, రబ్బరు విడిభాగాలు పాడవుతాయా?
లేదు, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దేశవ్యాప్త వినియోగానికి ముందు ఈ20 ఇంధనంపై ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థలు, తుప్పు వంటి అనేక ల్యాబ్ పరీక్షలు జరిగాయి.
5. వెహికల్ మాన్యువల్లో ‘ఈ10 కంపాటిబుల్’ అని ఉంటే, అందులో ‘ఈ20’ వాడటం ప్రమాదకరమా?
లేదు, అది ప్రమాదకరం కాదు. వాహనం కొనుగోలు చేసిన సమయంలో అప్పటి ఇంధన ప్రమాణాల ఆధారంగా మాన్యువల్లో అలా రాసి ఉంటుంది. అంతేకానీ కొత్త ఇంధన ప్రమాణాలు వచ్చిన వెంటనే పాత వాహనాలకు ప్రమాదం జరుగుతుందని కాదు.
6. ఈ20 ప్రోగ్రామ్‌ను కేంద్రం ఆగమేఘాల మీద అమల్లోకి తెచ్చిందా?
లేదు. ఇది 20 ఏండ్లకు పైగా సాగిన ప్రక్రియ. 2001లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై, 2006లో 5% (ఈ05), 2022 నాటికి 10% (ఈ10), 2025 నాటికి 20% (ఈ20) లక్ష్యాన్ని క్రమంగా చేరుకుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని (దాదాపు 1,200 కోట్ల లీటర్లు) పెంచుకున్న తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
7. సాధారణ పెట్రోల్ కంటే ఈ20 వాడటం వల్ల వచ్చే లాభాలేంటి?
ప్యూర్ ఇథనాల్ ఆక్టేన్ రేటింగ్ 108.5 గా ఉంటుంది. ఇది పెట్రోల్లో కలవడం వల్ల ఇంధన ఆక్టేన్ రేటింగ్ 95 కి పెరుగుతుంది, తద్వారా ఇంజిన్ పనితీరు, పికప్ మెరుగవుతుంది. వాహనం సాఫీగా ముందుకు సాగుతుంది. పర్యావరణానికి మేలు చేస్తూ, కార్బన్ ఉద్గారాలను దాదాపు 40 శాతం వరకు తగ్గిస్తుంది.
8. దేశానికి చేకూరే ప్రయోజనాలేంటి?
ఈ కార్యక్రమం వల్ల దేశానికి ఏకంగా రూ.1.97 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) ఆదా అయ్యింది. దీని ద్వారా సుమారు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులను తగ్గించుకోగలిగాం. ఇప్పటివరకు రైతులకు రూ.1.66 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఏకంగా 952 లక్షల టన్నుల కర్బన (కార్బన్) ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల 2022 నుంచి 2026 మధ్య దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం 5.58% మాత్రమే నమోదైంది. ఇదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో 39% పైగా పెరిగింది.
9. ఇథనాల్ పెట్రోల్‌ను ఏఏ దేశాల్లో వాడుతున్నారు?
అమెరికాలో ఈ10 పెట్రోల్ ప్రామాణికంగా వాడుతున్నారు. ప్రస్తుతం ఈ15 ఇంధనాన్ని విస్తరిస్తున్నారు. అక్కడ ఇంధనంలో 85% వరకు ఇథనాల్ (ఈ85) వాడగల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు కూడా ఉన్నాయి. బ్రెజిల్లో కనీసం ఈ27 (27% ఇథనాల్) మిశ్రమాన్ని తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దీనిని 35% కి పెంచుతున్నారు. అక్కడ అమ్ముడవుతున్న 80% పైగా కొత్త వాహనాలు ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్ ఉన్నాయి. జపాన్ ఇప్పటికే ఈ10 ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెట్టింది. కెనడా, థాయిలాండ్, పలు యూరోపియన్ దేశాలు కూడా తమ క్లీన్ ఫ్యూయల్ వ్యూహాలలో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్‌ను వాడుతున్నాయి.

