కలం, స్పోర్ట్స్ బ్యూరో: ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతున్న ‘ఫిఫా ప్రపంచకప్-2026’ కేవలం ఆటలోనే కాదు.. సరికొత్త టెక్నాలజీ (FIFA World Cup Technology)తో చరిత్ర సృష్టిస్తున్నది. మైదానంలో అంపైరింగ్ పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకత కోసం ఫిఫా అత్యంత విప్లవాత్మకమైన హైటెక్ అస్త్రాలను వాడుతున్నది.
ఫుట్బాల్ లోపల అమర్చిన మైక్రోచిప్ (సెన్సార్) ఈసారి ఫిఫా మ్యాచ్లకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. నిజానికి బంతిలో చిప్ పెట్టడం ఇది మొదటిసారి కాదు. గత 2022 కతార్ వరల్డ్ కప్ లోనే దీనిని తొలిసారి పరిచయం చేశారు. బంతి మధ్యలో ఉండే ఈ సెన్సార్ సెకనుకు 500 సార్లు డేటాను వీడియో రూమ్‌కు పంపుతూ.. క్లిష్టమైన ‘ఆఫ్‌సైడ్’ నిర్ణయాలను క్షణాల్లో తేలుస్తుంది. బంతి గోల్ లైన్ దాటగానే రెఫరీ వాచ్‌కి సిగ్నల్ పంపడం దీని ప్రత్యేకత. ఈ ఈ స్మార్ట్ ఫుట్బాల్‌కు మ్యాచ్ ప్రారంభానికి ముందు సుమారు 90 నిమిషాల పాటు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టాలి.
థర్డ్ ఐ: వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా ఫీల్డ్ రెఫరీలకు హై-డెఫినిషన్ బాడీ కెమెరాలను అమర్చారు. దీనివల్ల రెఫరీ చూసే విజువల్స్ ను ప్రేక్షకులు టీవీల్లో లైవ్గా చూడగలుగుతున్నారు.
ప్లేయర్స్ 3డీ అవతార్స్: వివాదాస్పద నిర్ణయాల రీప్లే కోసం మైదానంలోని కెమెరాల సాయంతో ప్లేయర్ల శరీరంలోని 29 పాయింట్‌లను ట్రాక్ చేస్తూ, కచ్చితంగా వారిలాగే ఉండే ‘3డీ డిజిటల్ అవతార్’ రీప్లేను స్క్రీన్లపై చూపిస్తున్నారు.
మైకుల్లో రెఫరీ ప్రకటనలు: వీఏఆర్ (వీడియో అసిస్టెంట్ రెఫరీ) ద్వారా ఏదైనా నిర్ణయాన్ని మార్చినప్పుడు, ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో రెఫరీ మైదానంలోని స్పీకర్ల ద్వారా స్టేడియంలోని ప్రేక్షకులకు లైవ్ గా అనౌన్స్ చేస్తున్నారు.
ఆటగాళ్లకు ట్రాకర్స్: ఆటగాళ్లు జెర్సీ కింద ధరించే టైట్ ఫిట్టింగ్ వెస్ట్ ద్వారా జీపీఎస్ ట్రాకర్లు, హార్ట్ రేట్ సెన్సార్లు అమర్చి లైవ్ డేటా సేకరిస్తారు. ఇవి ప్లేయర్ రన్నింగ్ స్పీడ్, హార్ట్ రేట్, అలసట స్థాయిని లైవ్ గా ట్రాక్ చేస్తూ కోచ్‌లకు డేటా అందిస్తాయి.
రోబో డాగ్స్: మ్యాచ్ నిర్వహణతో పాటు స్టేడియంలలో ఫ్యాన్స్ భద్రత కోసం కూడా మునుపెన్నడూ లేని విధంగా ఏఐని రంగంలోకి దించారు. స్టేడియాలు, ఫ్యాన్ జోన్లలో భద్రతను పర్యవేక్షించడానికి బోస్టన్ డైనమిక్స్ సంస్థకు చెందిన చతుష్పాద రోబోట్లు ‘స్పాట్’ (రోబో డాగ్స్) రాత్రి పగలు కాపలా కాస్తున్నాయి. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ఇవి లైవ్ విజువల్స్ సేకరిస్తాయి.
యాంటీ-డ్రోన్ రక్షణ: శత్రు డ్రోన్ల ముప్పును తిప్పికొట్టడానికి అన్ని మ్యాచ్ వేదికల చుట్టూ భారీ వ్యయంతో యాంటీ-డ్రోన్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
స్మార్ట్ కూలింగ్: ఓపెన్-టాప్ స్టేడియంలలో కూడా ప్రేక్షకులు, ఆటగాళ్ల కోసం సరికొత్త ‘కూలింగ్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. సీట్ల కింద ఉండే చిన్న రంధ్రాల ద్వారా చల్లని గాలిని పంపుతూ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ 21 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంచుతున్నారు.
అల్ట్రా 5G: లక్షలాది మంది అభిమానులు ఒకేసారి ఇంటర్నెట్ వాడినా సిగ్నల్స్ జామ్ అవ్వకుండా స్టేడియం చుట్టూ ‘mmWave 5G’ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దీనితో 4K వీడియోలు కూడా క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతాయి.
బ్లాక్చైన్ టికెట్లు: టికెట్ల బ్లాక్ మార్కెట్, నకిలీలను అరికట్టేందుకు ‘బ్లాక్చైన్’ డిజిటల్ టికెట్లను తెచ్చారు. వీటిని స్క్రీన్ షాట్ తీయడం కుదరదు, స్టేడియం గేట్ దగ్గరకు వెళ్తేనే క్యూఆర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది.
స్మార్ట్ రీసైక్లింగ్ బిన్స్: స్టేడియం పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఏఐ కెమెరాలతో కూడిన ‘స్మార్ట్ డస్ట్ బిన్స్’ ఏర్పాటు చేశారు. ఇవి ఫ్యాన్స్ వేసే ప్లాస్టిక్ బాటిళ్లు, కాగితాలు, మిగిలిన ఆహారాన్ని ఆటోమేటిక్‌గా వేరు చేసి సైక్లింగ్ కు పంపుతాయి.

