కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకుంటున్న పరిస్థితులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తాడెపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుస్తామనే ధైర్యం లేకనే చంద్రబాబు నామినేషన్ల ప్రక్రియలో విధ్వంస పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో కూటమి, మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారని చెప్పారు. అయినా.. ఫ్రీ అండ్ ఫైర్గా ఎన్నికలు జరిగితే గెలుస్తామనే ధైర్యం చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు.
నామినేషన్లను అడ్డుకున్నప్పుడే ఓడిపోయినట్లేనని టీడీపీ పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైసీపీ అభ్యర్థులను ఎందుకు అరెస్టులు, కిడ్నాప్ లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నామినేషన్లు వేయనియకుండా వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారని, కనీసం నామినేషన్ పత్రాలు కూడా అధికారులు తీసుకోవడం లేదన జగన్ ఆరోపించారు. నామినేషన్ల పత్రాలను టీడీపీ గూండాలు లాక్కెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
2019లో ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో నారాసుర రక్తచరిత్ర నడిచిందని.. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేళ మళ్లీ అదే రిపీట్ అవుతోందని జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికలకు రెండు రోజుల ముందే రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు ముందు నుంచే కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.

