కలం, యాదగిరిగుట్ట : విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల (Police Martyrs) త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు భావితరాల పోలీస్ సిబ్బందికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లా సైదాపూర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సంస్మరణ పరేడ్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఐఏఎస్, జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి
పోలీస్ మాన్యువల్ ప్రకారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి వీర పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆర్ఐ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సంస్మరణ పరేడ్ నిర్వహించారు. అమరవీరులకు గౌరవ సూచకంగా శోక శస్త్రం సమర్పించడంతోపాటు, లాస్ట్ పోస్ట్‌కు అధికారులు, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది సేవలను స్మరించుకున్నారు.
కుటుంబాలకు భరోసా.. సంక్షేమానికి ప్రాధాన్యం
ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలు ఒంటరివి కావని, పోలీస్ శాఖ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను కేవలం ఒకరోజు స్మరించుకోవడమే కాకుండా, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల భద్రతకు అంకితభావంతో పనిచేయడమే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఐదుగురు అమరవీరుల కుటుంబాల హాజరు
ఈ సంస్మరణ కార్యక్రమానికి స్వర్గీయ సంగి లక్ష్మీనారాయణ, స్వర్గీయ ఎం.డి. అఫ్జల్ షరీఫ్, స్వర్గీయ ఎం.డి. అహ్మద్ మొయినుద్దీన్ (నల్గొండ), స్వర్గీయ వి. లింగయ్య (రామన్నపేట, శోభనాద్రిపురం), స్వర్గీయ సి.హెచ్. నాగరాజు (రసూల్‌గూడెం, కట్టంగూర్ మండలం) కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి సంఘీభావం తెలిపారు.
అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, డీఎస్పీలు శ్రీనివాస్ నాయుడు, రవీందర్, మధుసూధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సురేష్, సీఐలు శంకర్, చంద్రబాబు, భాస్కర్, మధుసూదన్, ఆర్ఐలు శ్రీనివాస్ నాయుడు, లతీఫుద్దీన్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల త్యాగం దేశానికి స్ఫూర్తి.. వారి కుటుంబాల సంక్షేమం సమాజ బాధ్యత అనే సందేశంతో సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సాగింది.

