యాదాద్రి జిల్లాలో కరువుపై ముందస్తు సమరం

కలం, యాదాద్రి భువనగిరి: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు గ్రామసభల ద్వారా సమగ్ర కరువు నివారణ, ఉపశమన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో కీలక సూచనలు చేశారు.

గ్రామాల వారీగా సమస్యల గుర్తింపు..

గ్రామసభల్లో కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. ప్రతి గ్రామంలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భజలాల మట్టాలు, సాగునీటి కొరత, పంటల సంరక్షణ, పశువులకు నీరు, పశుగ్రాసం వంటి అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. గుర్తించిన సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రణాళికలో పొందుపరచాలని పేర్కొన్నారు.

చెరువుల పునరుద్ధరణ..

కరువు ముప్పును తగ్గించేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులు, ఇతర నీటి వనరులను పునరుద్ధరించడం, భూగర్భజలాలను పెంపొందించడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. నీటి పొదుపు పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి శాఖ తమ పరిధిలోని సమస్యలు, అవసరాలు, గణాంకాలు, చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలతో గ్రామసభలకు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొని క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>