కలం, వనపర్తి: సమాజ పరిరక్షణ, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి (SP Sunitha Reddy) ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో (Police Martyrs Remembrance Week) భాగంగా శనివారం వనపర్తి పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేడిఆర్ పాలిటెక్నిక్ వరకు బైక్ ర్యాలీ ( Bike Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తూ కొన్నిసార్లు పోలీసులు ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తోందన్నారు.
ప్రాణాలకు ముప్పు ఎదురైనా ప్రజలను రక్షించడంలో పోలీసులు ముందుంటారని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. సమాజంలో ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తారని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, వనపర్తి సీఐ సుగంధరత్నం, కొత్తకోట సీఐ రమేష్, ఆత్మకూరు సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

