కలం, వెబ్ డెస్క్: జైలులో ఉన్న ప్రియుడికి బెయిల్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఓ యువతి డ్రగ్స్ రవాణా (Drug Smuggling) కు పాల్పడిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో నాగసౌమ్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. వివరాల ప్రకారం.. నాగసౌమ్య ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు.
అతడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరాకు అంగీకరించినట్లు సమాచారం. బషీర్ అనే సరఫరాదారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తే రూ.50 వేల కమీషన్ ఇస్తానని ఆమెకు ఆశ చూపినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పోలీసులకు కనిపించకుండా ఉండేందుకు నాగసౌమ్య తన ప్యాంటుకు ప్రత్యేకంగా కుట్టించిన జేబులో ప్యాకెట్లను దాచినట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే, పోలీసుల తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారా బషీర్‌కు చేరవేసినట్లు వెల్లడైంది. విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాగసౌమ్యను అదుపులోకి తీసుకున్నారు. తొలుత స్టేషన్ నుంచి తప్పించుకున్న బషీర్‌ను కూడా బుధవారం విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : నాలుగేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. వధువు షాకింగ్ నిర్ణయం!
Follow Us On : WhatsApp

