కలం, స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ ఫైనల్స్-2027కు చైనాలోని బీజింగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు జరగనుంది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. బీజింగ్‌లో చివరిసారిగా 2005లో సుదిర్మన్ కప్ జరిగింది. 1987లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లకూ ఈ నగరం ఆతిథ్యం ఇచ్చింది. 2008 ఒలింపిక్స్‌లోనూ బ్యాడ్మింటన్ పోటీలు ఇక్కడే జరిగాయి. 2027 నుంచి సుదిర్మన్ కప్ నిర్వహణలో కీలక మార్పులు రానున్నాయి. టోర్నీ వ్యవధిని 12 రోజులకు పెంచనున్నారు. అలాగే పాల్గొనే జట్ల సంఖ్యను 24కు పెంచనున్నారు. దీంతో పోటీలు మరింత విస్తృతంగా జరిగే అవకాశం ఉంది.
సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ ప్రపంచ ఛాంపియన్షిప్. ప్రతి రెండేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. 2025లో చైనాలోని జియామెన్‌లో జరిగిన టోర్నీలో ఆతిథ్య చైనా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 3-1తో ఓడించింది. ఇప్పటివరకు చైనా 13 సార్లు సుదిర్మన్ కప్‌ను గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. భారత జట్టు 2011, 2017లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క పతకాన్ని కూడా గెలుచుకోలేదు. 2027 టోర్నీలో భారత జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

