కలం, నకిరేకల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆడబిడ్డల అతి పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు నకిరేకల్ నియోజకవర్గంలో మిన్నంటాయి. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ( MLA Vemula Veeresham) నివాసంలో ఆదివారం బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రంగురంగుల పూలతో బతుకమ్మలను కన్నుల పండువగా పేర్చి, సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు, బతుకమ్మ పాటలతో ఊరేగింపుగా బయలుదేరి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పూలనే దైవంగా భావించి పూజించే అరుదైన విశిష్టత మన తెలంగాణ సంస్కృతికి ఉందన్నారు. బతుకమ్మ పండుగ ప్రజల మధ్య సోదరభావాన్ని, సద్భావనను పెంపొందిస్తుందని తెలిపారు. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఆడబిడ్డలందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

