కలం, మెదక్ బ్యూరో: రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) రైతులను కోరారు. తమ పంటకు ప్రభుత్వం ప్రకటించిన ధరను పొందేలా కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని రైతులకు విజ్ఞప్తి చేశారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ముత్తంగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని అన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోపాటు వర్తించే బోనస్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ముత్తంగి చైర్మన్ బిక్షపతి, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

