కలం, వనపర్తి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) ప్రకటించారు. పాలమూరు ప్రాంత రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఏర్పాట్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూమును కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడంతోనే ఏర్పాటు చేశామని తెలిపారు. కేఎల్‌ఐ పథకంలో కాలువల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైతాంగానికి పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చేందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నార్లాపూర్ నుంచి ఎల్లూరుకు, ఏదుల నుంచి బుద్ధారం కాలువకు, వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు అనుసంధానం చేసే నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దే ప్రయత్నం బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేశామని ఆయన అన్నారు.
‘ప్యాకేజీ-3లో మట్టి తొలగిస్తే నీటి విడుదలకు అవకాశం’
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్యాకేజీ-3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగించి నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న పంపులను నడిపేందుకు ఇబ్బంది లేదని, పది పంపులను ఒకేసారి నడిపితే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద పంపులు సిద్ధంగా ఉన్నాయని, అక్కడి నుంచి కరివెన వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి రిజర్వాయర్‌లో ఐదు టీఎంసీల నీటిని నింపవచ్చని, మిగిలిన పనులను వచ్చే ఏడాది పూర్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్యాకేజీ-3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగిస్తే నీటి ప్రవాహానికి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
మూడేళ్లుగా పనులు ఎందుకు ఆగాయి?
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లుగా ఎందుకు నిలిచిపోయాయని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పిలిచిన కాలువల టెండర్లను రద్దు చేయడానికి కారణమేంటని, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ గత మూడేళ్లుగా కోరుతున్నప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేశారని తాము భావిస్తున్న అధికారులను రాష్ట్ర సాగునీటి సలహాదారులుగా నియమించుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పాలమూరు ప్రజల ప్రయోజనాలపై తగిన శ్రద్ధ చూపడం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పాలమూరు ప్రజలతోపాటు తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే శాశ్వతమని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌ను స్వీకరిస్తూనే, రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి ప్రాజెక్టు పనులకు సహకరించాలని నిరంజన్‌రెడ్డి కోరారు.

