అల్లం రైతులకు అగ్గి తెగులు గుబులు..!

క‌లం, మెద‌క్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) ప్రాంతంలో రైతులకు అల్లం సాగు చేస్తున్న రైతుల‌కు కొత్త ఆందోళన మొదలైంది. అల్లం పంట (Ginger Crop) లో సాధారణంగా కనిపించే తెగుళ్లకు భిన్నంగా, సరికొత్తగా ‘అగ్గి తెగులు’ ను పోలిన ఒక ప్రమాదకరమైన తెగులు సోకుతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు, శాస్త్ర‌వేత్త‌ల సంయుక్త బృందం జ‌హీరాబాద్ ప్రాంతంలో పర్యటించింది. క్షేత్ర‌ స్థాయిలో అల్లం పొలాలను క్షుణ్ణంగా పరిశీలించి, తెగులు లక్షణాలను, పంటపై ప్రభావం నష్ట తీవ్రతపై రైతులతో చర్చించి, ప‌లు సూచనలు చేశారు. మ‌రోవైపు మార్కెట్ లో మంచి ధ‌ర ప‌లుకుతున్న అల్లం పంటకు తెగులు ప్రభావం ఎలా ఉంటుందోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

అల్లం సాగుకు ప్ర‌సిద్ధి

సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ ప్రాంతంకు అల్లం సాగు (Ginger Crop) లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో పండించే అల్లం పంట‌కు దేశ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉటుంది. జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లోని ఎర్ర నేలలు వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఉద్యాన పంటలైన అల్లం, పసుపు, చెరకు వంటివి పెద్ద ఎత్తున సాగవుతాయి. ఈ ప్రాంతంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వందలాది ఎకరాల్లో రైతులు అల్లం పంటను నమ్ముకుని జీవిస్తున్నారు.

గ‌త రెండేళ్ల‌తో పోల్చితే అల్లం మద్దతు ధర ఒక్కసారిగా పెరగడంతో ఈసారి సాగుపై రైతులు దృష్టి పెట్టారు. ఈ సంవ‌త్స‌రం జ‌హీరాబాద్ ప్రాంతంలో సుమారు 2000 ఎకరాల్లో అల్లం సాగు చేస్తున్నారు. ధర లేక డిమాండ్ లేని టైంలో 800 ఎకరాల్లో పంట పండించగా, అప్పట్లో క్వింటాల్ అల్లం ధర రూ.2 వేలు పలికింది. ప్రస్తుతం మార్కెట్​లో అల్లం క్వింటాల్ ధర రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. పెరిగిన ధరలు, మార్కెట్ డిమాండ్ ఉండ‌టంతో రైతులు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచారు.

అల్లం పంట సాధారణంగా మే నుంచి జూన్ నెలాఖరు వరకు సాగు చేస్తుంటారు. కేరళ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి నాణ్యమైన విత్తనాలను తీసుకొచ్చి అల్లం పండిస్తారు. ఒక‌సారి అల్లం పంట సాగు చేస్తే రెండేండ్ల వరకు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. మార్కెట్​లో ధర లేనప్పుడు నీటి తడులు ఇవ్వడం ద్వారా పంట భూమిలోనే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నిల్వ ఉన్న పంటకు మొలక వచ్చి తిరిగి పంట విస్తీర్ణం పెరిగి అల్లం దిగుబడి కూడా పెరిగే అవకాశాలుంటాయి. దాంతో మార్కెట్ ధరకు అనుగుణంగా అల్లం పంటను అమ్ముకునే అవ‌కాశం ఉంటుంది.

తెలంగాణకు తాకిన తెగులు..!

విత్తనంగా వాడే అల్లం కొమ్ములను నాటే ముందు తప్పనిసరిగా అధికారులు సిఫార్సు చేసిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు తీవ్రంగా సోకిన ప్రాంతాల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లం విత్తనానికి వాడే కొమ్ములను సేకరించకూడదు. ఆరోగ్యకరమైన ప్రాంతాల నుండి మాత్రమే విత్తనాన్ని కొనుగోలు చేయాలి. అయితే, ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంతాల్లో అల్లం సాగు చేసిన రైతులకు ‘అగ్గి తెగులు’ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపించిన ఈ తెగులు, సరిహద్దులు దాటి జహీరాబాద్ ప్రాంతానికి పాకడంతో అల్లం రైతులు ఆందోళన చెందుతున్నారు.

అల్లం సుదీర్ఘకాలిక పంట. దుక్కి తయారీ, నాణ్యమైన విత్తన కొమ్ములు, ఎరువులు, పురుగుమందులు, కలుపు, కూలీల ఖర్చులు అన్నీ కలిపితే ఎకరాకు ల‌క్ష‌కు పైగా వ్యయమవుతుంది. భూమి లోప‌ల అల్లం పంట దుంప ఊరే కీలక దశలో తెగులు సోకడంతో ఆకులు ఎండిపోయి మ‌చ్చ‌లు మ‌చ్చలుగా క‌న్పిస్తున్నాయి. దీనివల్ల అల్లం దుంపల సైజు పెరగక, కుళ్ళిపోయి దిగుబడి తగ్గిపోతోంది. ఫలితంగా రైతుల‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. సాధారణంగా వరి పైరును ఆశించే ‘పైరికులేరియా’ అనే శిలీంధ్రం (ఫంగస్) ద్వారా అగ్గితెగులు సోకుతుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అగ్గి తెగులు ప్రభావం చూపుతుంది. దీంతో అక్క‌డి నుంచి దిగుమతి చేసుకున్న విత్తన కొమ్ములు, వర్షపు తుంపర్ల ద్వారా ఈ తెగులు ఇక్కడికి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తెగులు నివారణ‌.. శాస్త్రవేత్తల సూచ‌న‌లు

ఈ ప్రమాదకరమైన తెగులు మొదట కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కొత్తగా వ్యాపించగా, ఇప్పుడు తెలంగాణలోని మన ప్రాంతానికి కూడా పాకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ తెగులును కలుగజేస్తున్న శిలీంద్రాన్ని కేరళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (IISR) శాస్త్రవేత్తలు ‘ప్రాక్జిపైరీక్యులేరియా జిన్జబెరిస్’గా గుర్తించారు. అగ్గి తెగులు మాదిరిగానే ఆకులపై మచ్చలు ఏర్పడి, క్రమంగా ఆకులు ఎండిపోవడం, మొక్క పెరుగుదల నిలిచిపోవడం జరుగుతుంది.

దీనివల్ల భూమిలో అల్లం కొమ్ములు సరిగా ఊరక కుళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఇది రైతన్నలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతుంది. తెలంగాణలో అల్లం పంటల ప‌రిస్ధితిపై కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు , సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం ఉద్యాన శాస్త్రవేత్తలు జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్తల బృందం జహీరాబాద్, కోహీర్ మండలాల్లో పర్యటించి ఎండుతున్న అల్లం పంటలను పరిశీలించారు. అల్లం పంటకు అగ్గితెగులు సోకడం వాస్తవమేనని వారు నిర్ధారించారు.

అయితే ప్ర‌మాద‌కార స్థాయిలో లేన‌ప్ప‌టికీ.. రైతులు తెగులు సోక‌కుండా త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించారు. తెగులు నివారణ కోసం ‘ప్రొపికోనజోల్’ లేదా ‘టెబుకోనజోల్’ మందును లీటరు నీటికి 1 మి.లీ చొప్పున కలిపి పైపాటుగా పిచికారి చేయాలి. అంతేకాకుడా పొలంలో నీరు లేదా తేమ నిల్వ ఉండకుండా సరైన మురుగునీటి పారుదల వసతి కల్పించాలని చెబుతున్నారు. సస్యరక్షణ చర్యలతోనే , తెగులు ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం వ‌ల‌న దీన్ని కట్టడి చేయ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>